Monday, November 12, 2012

 

Naa Deepavali Gnyapakalu

రాత్రి బాగా కాలాలి అని పగలు ఎండబెట్టిన మందుగుండు సామాన్లు..
అలా  ఎండబెట్టిన సామాన్ల లోనుండి , ఆత్రుత ఆపుకోలేక బయటకి తీసిన సీమ టపాకాయలు..
అలా తీసిన టపాకాయల్ని కాల్చడానికి వాడిన అగరుబత్తీలు ..
కాల్చిన తర్వాత వచ్చే పొగ తాలూకు వాసనలు , శబ్దాలు.. .
తర్వాత మిగిలిన కాగితపు చుట్టలు ...
డీడీ -8 లో మాత్రమే వచ్చే దీపావళి సినిమాలు..
రాత్రి జరిగే టపాకాయల తంతు కి నాంది పలికే "డాట్ క్యాప్స్ , రీల్స్" మరియు పాము బిళ్ళలు ..
రాత్రి దగ్గరయ్యే కొద్దీ ఎక్కువయ్యే బాంబుల శబ్దాలు..
గోడల మీద పేర్చే దీపాల వరుసలు ..
చీకటి పడుతూనే చుక్కలని తాకే తారాజువ్వలు..
పెలాక కూడా అలాగే ఉండే కొన్ని లక్ష్మి టపాకాయలు..
పేలిన తర్వాత మిగిలే తమిళ న్యూస్ పేపర్ల ముక్కలు..
కాకరపువ్వొత్తుల డబ్బాల మీద ఉండే హీరోయిన్ల బొమ్మలు..
హైడ్రోజెన్ బాంబుని వెలిగించే టపుడు  అది సరిగ్గా వెలిగిందా లేదా అనే అనుమానాలు..
ఆ సంవత్సరం కొత్తగా మార్కెట్ లో రిలీజ్ అయిన కొత్త ఫాన్సీ టపాకాయలు..
వీధిలో అందరికన్నా ధనవంతులం అని చెప్పకనే చెప్పే 10,000 వాలాలు ...
విష్ణు చక్రం తిరిగాక మిగిలిన వంచేసిన ఇనుప తీగలు..
దారితప్పిన భూ చక్రాలు..
వెలుగుల్ని విరజిమ్మే చిచ్చు బుడ్డీలు..
నిప్పురవ్వలు తగిలి చిల్లులు పడ్డ బట్టలు..
అమ్మా , నాన్న తిరిగి ఇంటిలోకి వెళ్ళాక కూడా టపాకాయలు కాల్చుకునే పిల్లలు..
తమ టపాకాయలు అయిపోయాక , పక్కింటి వాళ్ళు కాల్చే టపాకాయలు చూస్తూ ఆనందించే అల్పసంతోషులు..
రేపటికోసం దాచుకున్న ఒకటీ అరా, మతాబులు..
ఇంటికి వచ్చేసాక కూడా వినపడే తారాజువ్వల చప్పుళ్ళు..
అంతా  అయిపోయాక ఇంటికి ముందు పేరుకున్న కాగితపు గుట్టలు ..
అలా పేరుకున్న చెత్తని పోగేసి, కాల్చేటపుడు అనుకోకుండా పేలిన చిన్న సీమ టపాకాయి ఇచ్చే ఆనందాలు ...

వెరసి, దీపావళికి నా చిన్నతనాన్ని తట్టి లేపే నా జ్ఞ్యాపకాలు ..
అందరికి ఇవే నా దీపావళి శుభాకాంక్షలు..

Comments:
చాలా బాగుంది రవి. 100% నా జ్ఞాపకాలతో match అయ్యాయి :)
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]