Monday, April 13, 2009

 

ప్రదీప్ గాడి పెళ్లి..

సమయం : 19:05 ఏప్రిల్ 07 2009 ( ఇరవై ఐదు నిముషాలు ఫాస్ట్ గా ఉన్న నా సెల్ ఫోన్ లోని టైం)

ప్రదేశం: మాదాపూర్ దగ్గర్లో మా ఆఫీసు లో కాన్ఫరెన్స్ రూమ్..

వైబ్రేషన్ మోడ్ లో ఉన్న నా మొబైల్ ,టేబుల్ మీద "బ్ర్ర్ర్ర్ర్ర్ బ్ర్ర్ర్ర్ర్ర్ర్ బ్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్" అంటూ ఒక మెసేజ్ మోసుకొచ్చింది.. ఓపెన్ చేసి చుస్తే, చైతన్య నుండి "ట్విస్ట్ ఇన్ ది టేల్" అని మెసేజ్..డిటైల్స్ చూడకుండానే అర్ధం అయ్యింది, చైతు గాడు ప్రదీప్ గాడి పెళ్ళికి డ్రాప్ పెట్టాడని..నాకు పెద్దగా ఆశ్చర్యం వెయ్యలేదు..ఆశ్చర్యం వేసే స్టేజి దాటి చాల కాలమే అయ్యింది మరి..



సమయం: 7:45 PM (PM అంటే ఈవినింగే కదా??)

ప్రదేశం: హైటెక్ సిటీ క్రాస్ రోడ్స్ , ఈదురు గాలికి రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న ట్రాఫిక్ పోస్టు పక్కన..

ఆటో వాడు నా IT రిటర్న్స్ జిరాక్స్ కాపి అడుగుతున్న సమయం..నా ఫోన్ మళ్ళి మోగింది..

లిఫ్ట్ చేస్తే సునీత..లింగంపల్లి లో తను అప్పుడే MMTS లో బయలుదేరానని చెప్పింది...అప్పుడే వెలిసిన వాన నీటిలో కళ్లు చెదిరే కాంతితో మరో మెరుపు ప్రతిబింబం...

కొద్ది సేపాగాక ఆటో వాడు ఫేర్ చెప్పినప్పుడు నా గుండె గుభేలుమన్నంత సౌండ్ తో ఒక ఉరుము...



సమయం : 20: 15 , (ఇలా ఐతే కంఫ్యూజన్ ఉండదు..) IT పక్షులు గూళ్ళకు చేరుకునేందుకు MMTS స్టేషన్ కి చేరుకునే టైం

ప్రదేశం : హైటెక్ సిటీ రైల్వే స్టేషన్

హైటెక్ సిటీ లో రవి కిరణ్ని చైతన్య డ్రాప్ చేసాడు..(డ్రాప్ చెయ్యడం చైతు గాడికి ఫావెరేట్ హాబీ) ....

రవి కి సేఫ్టీ కొంచెం ఎక్కువ కదా, ట్రైన్ లో కూడా హెల్మెట్ పెట్టుకుని మరీ సునీత ఎక్కిన MMTS లో ఎక్కాడు..(కానీ వేరే బోగీ లో, ఎందుకంటే, సునీత ఎక్కిన బోగీ లో అమ్మాయిలు పెద్దగా బాగోలేరంట..;) ) ఇంత జాగ్రత్త పరుడు, టికెట్ ఎందుకు తీసుకోలేదు అని అడిగితే, మేం మాత్రం ఎం చేప్తాంమండీ...బద్ధకం.. ;)



సమయం: 20: 30,

ప్రదేశం: IDPL Colony

ఆటోలు దొరకడం పెద్దగా కష్టం కాని ప్లేస్ అయినప్పటికీ, కవిత వాళ్లకి ఇంకా ఆటో ఏమి దొరకలేదు(For the uninformed, Kavitha is my wife)..నాకు ఎప్పటిలాగానే పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు..కారణం, అసలు మేమంతా వెళ్తున్నది ఎవరి పెళ్ళికని మరి??!!వర్షం , హోరు గాలి ఇంకాస్త ఎక్కువయ్యాయి..కవిత టెన్షన్ తో పాటు...



సమయం:20: 50

ప్రదేశం:నాంపల్లి రైల్వే స్టేషన్

రవి కిరణ్ , సునీత కలుసుకున్నారు..ట్రైన్ స్టార్ట్ అయ్యేది నాంపల్లి అని తెలియక, నేను, కవిత సికిందరాబాద్ కి ఆటోల్లో వెళ్తూ ఉన్నాం..



సమయం: 9:15 PM

ప్రదేశం: సికిందరాబాద్ రైల్వే స్టేషన్..

నేను, కవిత కలుసుకున్నాం..రవి కిరణ్ వాళ్లకి ఫోన్ చేసి, ట్రైన్ నాంపల్లి లో స్టార్ట్ అవుతుందని తెలుసుకుని, 10:15 PM వరకు రైల్వే ADs చూసుకుంటూ కాలక్షేపం చేసాము..



సమయం: 10:45 PM , నా సెల్ ఫోన్ లోనే, (ఈసారి టైం కరెక్ట్ చేసుకున్నాను)

ప్రదేశం: అనవసరం..ట్రైన్ లో ఉన్నాం..:)

నలుగురం ట్రైన్ లో ప్రదీప్ పెళ్ళికి వెళ్తున్నాం ..ఈ విషయానికి మాత్రం నాకు ఆశ్చర్యం వేసింది..



సమయం: మేము నాన్ స్టాప్ గా వేస్తున్న సొల్లు భరించ లేక పక్క బెర్త్ లో ప్యాసింజర్ ,"టైం ఎంతయ్యిందో చూసారా?" అని అడిగేటంత...

ప్రదేశం: మళ్లీ అనవసరమే...ఇంకా ట్రైన్ లోనే ఉన్నాం..

ఇంకా చేసేదేమీ లేక, పడుకున్నాం..



సమయం: మిడిల్ బెర్త్ వాళ్ళు బెర్త్ మడిచి లోయర్ బెర్త్ వాడి నిద్ర చేడగోట్టేటంత..

ప్రదేశం : కరెక్ట్ గా ఏ ఫ్లెసొ తెలియదు కానీ, కొబ్బరి చెట్లు చేపల చెరువులు చూస్తూ ఉంటె మాత్రం, కోనసీమ అని తెలుస్తూంది..

మేము అనుకున్నది కరక్టే అని చెబుతూ, పాలకొల్లు రైల్వే స్టేషన్ రానే వచ్చింది..మాతో పాటు ట్రైన్ లో సగానికి పైగా జనం అక్కడే దిగిపోయారు..స్టేషన్ బయటకి రాగానే, తాటిపాక RTC బస్సు రెడీ గా ఉంది..కాసేపు కుస్తీ పట్టాక, బస్సు లో సీట్లు దొరికాయి.. లెక్కలేనన్ని సినిమాల్లో కోనసీమ అందాలని బ్లాకు అండ్ వైట్ కాలం నుండి చూస్తూనే ఉన్నా, మొదటి సారి చూస్తున్నందుకో ఏమో తెలియదు కానీ, మమ్మలనందరినీ తన పసిడి వన్నెలతో ,పచ్చని పొలాల పైర గాలులతో కట్టి పడేసినట్టు మా అలసటనంత తన చెంగుతో తుడిచివేస్తున్నట్టు, అనిపించింది..కనుచూపు మేర అంటా కూడా అందమైన కొబ్బరి చెట్లతో , ఆ చెట్ల మధ్య వరి చేలతో కోనసీమ అందాలు , చూస్తేనే తప్ప, రాసి వివరించలేనంతగా ఉన్నాయి..ట్రేడ్ మార్క్ కొబ్బరి చెట్లతో..దారి పొడవునా తోడు వచ్చే పంట కాలువలతో...మన రాష్ట్రాన్ని అన్నపూర్ణ గా అభివర్నించడానికి కారణమైన ఉభయ గోదావరి జిల్లాల శోభ నిజంగా దేదీప్యమానం .అలా ఒక 2 గంటలు ప్రయాణం చేసాక గోగులమఠం చేరుకున్నాం.


సమయం: నిద్ర మత్తు , ఆకలి, నీరసం, ఆయాసం కలిసి వచ్చే సమయం..మధ్యాహ్నం..

ప్రదేశం: పెళ్లి ఇల్లు..
ప్రదీప్ వాళ్ళదే అయినా, ఇంట్లో పెళ్లి కాబట్టి N.V ఐటెంస్ లేవు..అయినా మా ఆకలికి..(రవి కిరణ్ గాడి ఆకలికి అని చదవండి) అప్పుడు ఎం పేట్టినా తినేసేలాగా ఉన్నాము అనుకోండి..;)అలా ఆత్మారాముణ్ణి శాంతింప జేసి.. వెంటనే పడుకుంటే, ముత్యాల ముగ్గు సినిమా లో రావు గోపాల రావు గారి డైలాగ్ ఎవరన్నా కొడతారేమో అని, బద్దకంగా ఉన్నా, అలా ఊరి బయటకి వెళ్ళాము..కాసేపు అలా కళాపొషన చేసాక తిరిగి పెళ్ళింటికి చేరుకున్నాం..తర్వాత పెళ్లి వారితో కలిసి పాలకొల్లు బయలుదేరాము..


అన్నట్టు భోజనం విషయం లో పడి ఒక ఇంటరెష్టింగ్ విషయం చెప్పడం మర్చిపోయాను.

.

.

.

.

.నిజంగానే మర్చిపోయాను..;)

.

.

.

.

.



.యా..గుర్తొచ్చింది..ప్రదీప్ గాడి సింగిల్ ఫోటో సెషన్.. ఈ ఫోటో సెషన్ ప్రతీ పెళ్లికొడుక్కి శిరోభారం..ప్రతీ ఫోటొగ్రాఫర్ కి తులాభారం..(ఏదో ప్రాసకోసం వాడను..మీనింగ్ అడక్కండి..)

ఫోటొగ్రాఫర్ తను తీసుకున్న ప్రతీ రూపాయికి న్యాయం చేకూర్చడానికి పెళ్లి కొడుకుతో చిన్నపాటి సినిమానే తీసదంటే నమ్మండి..(కావలిస్తే పెళ్ళయిన ఇంకెవరినైనా అడగండి..)పెళ్లి మండపం కి వెళ్ళే దారిలో పెళ్లి బళ్ళన్నీ గోదావరి గట్టు దాటడమనే ఘట్టం గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి..గోదావరి మీద వేసిన వంతెన దాటడం అనే ఈ తంతు ఫోటోగ్రాఫర్ ప్రత్యెక శ్రద్ధతో తీసాడు..ఆ కార్లన్నీ వరసగా వెళ్తుంటే ఆ ఫోటో గ్రాఫర్ కళ్ళల్లో ఒక VV వినాయక్ , ఇంకో B. గోపాల్ కనిపించారు నాకు...;)

ఈ హడావిడి మధ్య మేమంతా కళ్యాణ మండపం చేరుకున్నాం..పెళ్లి కొడుక్కి ఇచ్చే విడిది గదికి మమ్మల్ని పంపించారు..ఆ గది నిండా ఎటు చూసినా పెద్ద పెద్ద లడ్డూలు , పూతరేకులు, జాంగ్రీలు మొదలైన స్వీట్స్ కనిపించాయి.. అప్పుడు రవి కిరణ్ గాడిని చూస్తె నాకెందుకో "తంతే వెళ్లి బూరెల గంప లో పడ్డాడు" అనే సామెత గుర్తొచ్చింది..అఫ్కోర్స్ , రవి గాడికి నన్ను చుసినా అదే సామెత గుర్తుకు వస్తుంది అని చెప్తాడనుకోండి..అది వేరే విషయం..అన్ని స్వీట్స్ చూసాక, ప్రదీప్ గాడు పెళ్లి మండపం కి వస్తాడో రాడో అని ఒకపక్క మాకు టెన్షన్ .ఒక వేళ రాను అని మారాం చేస్తే, పెళ్లి మండపం లో గ్రిల్ల్ద్ చికెన్ పెడుతున్నారని చెబితే సరి అని ఎవరో సలహా ఇచ్చారు..;)కాసేపటికి మేమంతా ఫ్రెష్ అయ్యి పెళ్లి మండపానికి చేరుకున్నాం..


సమయం: తాళి కట్టు శుభవేళ..

ప్రదేశం: పెళ్లి పందిరి..

ప్రదీప్ గాడు ఇంకా చేసేదేమీ లేక, తాళి కట్టడం తప్పదని తెలుసుకుని, ఇంత దూరం ఎలాగూ వచ్చాం కదా అని మనసులో అనుకుంటూ...

తాళి కట్టేసాడొచ్..



(ఎక్కడో దూరంగా "ఒనె మోర్ వికెట్ " అని రవి శాస్త్రి కీచు గొంతుకు తో అరిచిన ఫీలింగ్..)

ఇరు వైపుల వాళ్ళందరికీ నీరసం వచ్చేదాకా ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీసాక మేము భోజనానికి ఉపక్రమించాము..ఆ తరువాత గోగులమఠం కి తిరుగు ప్రయాణం అయ్యాం.ఆల్మోస్ట్ మేమొచ్చిన టైం కి పెళ్లి కొడుకు వాళ్ళ కార్ కూడా ఇంటికి వచ్చేసింది ..వర్జ్యం వీడే వరకు ఇంట్లోకి రానివ్వకుండా వరండా లో ఒక అరగంట వాళ్ళిద్దరిని ఆపేసారు..ఆ తర్వాత లోనికి రానిచ్చారు..అప్పటికే బాగా నిద్రని ఆపుకున్న మాకు, మాకు తెలిసే లోగానే నిద్ర వచ్చేసింది..


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]