Thursday, September 04, 2008

 

నా దారి ..రహదారి ..

భారత దేశాన్ని దర్శిద్దాం అనుకునే వారి , భారతీయ రహదారుల పై ప్రయాణిద్దాం అని సాహసించే వారి మనుగడ కోసం , నేను ఈ టపా రాస్తున్నాను. వాహనం బయట ఉండటం అంతగా క్షేమం కాని బీహార్ లో తప్ప ఇది భారత దేశం లో అన్ని ప్రాంతాలకి వర్తిస్తుంది..భారత రహదారుల నియమాలు కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తాయి..అంటే, మీరు చెయ్యవలసినది చేసి, మిగతాది మీ ఇంషురన్స్ కంపెనీ కి వదిలెయ్యాలి అన్నమాట...ఆ ఉద్దేశ్యం తోనే ఇవిగో!!! కొన్ని సలహాలు, సూచనలు...

1) మనం రోడ్డుకి కుడి వైపు నడపాలా ఎడమ వైపా?

జవాబు , రెండూ అనవచ్చు..

రూలు ప్రకారం ఎడమ వైపు నడపాలి..ఒకవేళ ఖాళీ లేకపోతే, కుడి వైపు..అదీ ఖాళీ లేకపోతే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నడపాలన్న మాట..చదరంగం లో లాగా..మీ మనసు చెప్పింది విని , దిస ను అంచనా వేసి ముందుకి సాగిపొండి..అంతే..చాలామంది తమ బళ్ళను నడపరు..కేవలం తము వెళ్ళాలి అనుకునే దిశలో ఎక్కుపెడతారు ..అది చూచి మీరు మానసికంగా క్రుంగిపోనవసరం లేదు.. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోడం కూడా అవసరం లేదు..పునర్జన్మ మీద నమ్మకం ఉండటం తప్పితే, మిగత డ్రైవర్లు మీకంటే మెరుగైన స్థితి లో ఏమి లేరు కాబట్టి..

ఎవడో వెదవ రోడ్డు దాటడం కోసం మీరు జేబ్రా క్రాసింగ్ వద్ద మీ బళ్ళను ఆపకండి ..మీ బండిని వెనక నుండి ఇంకో బండి చేత గుద్దిన్చుకోడం మీకు ఇష్టం ఐతే తప్ప..పాదచారులకు , ట్రాఫిక్ మెల్లిగా వెళ్తున్నప్పుడు కానీ, ఎవరైనా మినిస్టర్ వెళ్ళే కారణం చేత పూర్తిగా ఆగిపోయినప్పుడు తప్ప , రోడ్డు దాటకూడదు అని పక్కా ఆదేశాలు జారీ అయ్యాయి.. అప్పటికీ ఎవడైనా దాటాలి అనుకున్నాడనుకోండి.....

ఎందుకులెండి, ఈ లోకం లో లేని వాళ్ల గురించి చెడు గా మాట్లాడటం అంత బాగోదు...

చాల దేశాలలో లాగా హార్న్ కొట్టడం నిరసన వ్యక్తం చెయ్యడానికి ఒక సంకేతం ఎంత మాత్రం కాదు..ఇక్కడ హార్న్ కొట్టడం అంటే ఆనందం, ప్రేమ లేదా శుద్దమైన కామం కూడా అవ్వొచ్చు..మీ కోపాన్ని , చికాకు ని , లేదా రోడ్డుకి అడ్డంగా పడుకున్న ఆవుని అదల్చడానికి ఐనా హార్న్ వాడొచ్చు..

కార్ లో మంచి పుస్తకాలు నిలవ ఉంచుకోడం ఉత్తమం..ఎవరైనా మంత్రి గారి బందోబస్తు వెళ్ళేంత వరకు , లేదా రోడ్డు మీద వాన నీరు అడుగంటే వరకు మీకు మంచి కాలక్షేపంగా ఉంటుంది..

ఇక్కడ రాత్రి పూట బండి నడపడం చాల ఉత్తేజకరమైన అనుభవం..అప్పుడప్పుడు రోడ్డుకి అడ్డంగా బండ రాళ్ళు తప్పితే పెద్దగా ఆటంకాలు ఏమి ఉండవు..ఇంక ట్రక్కు డ్రైవర్ల విషయానికి వస్తే , వీళ్ళు సాక్షాత్తు యమకింకరులే !!అప్పుడప్పుడు మీకు ఒక తేజోవంతమైన ఆరడుగుల ఎత్తున్న కాంతి పుంజం తారస పడవచ్చు..అది ఒక అసామాన్యమైన మహా ద్విచక్ర వాహనం అనుకుంటే పొరబాటే..అది ఒక లైట్ పని చెయ్యని ఒక పెద్ద ట్రక్కు అనమాట..ఆ పని చెయ్యని లైట్ సాధారణంగా ఎడమ వైపుది అయ్యి ఉండొచ్చు..కొన్ని సార్లు కుడి వైపుది కూడా అయి ఉండొచ్చు...మరీ దగ్గరగా పరిశీలించడానికి వెళ్ళకండి..మీరు కీర్తి శేషులయ్యాక మీరన్నదే నిజం అవ్వొచ్చు..!!

రాత్రి కంటే పగలు ట్రక్కులు కొద్దిగా "కనిపిస్తూ" ఉంటాయి..కానీ డ్రైవర్లు సిగ్నల్స్ ఇవ్వరు..పక్కనుండే క్లీనరు మాత్రం పూనకం వచ్చినవాడికి మల్లె చేతులు ఊపుతూ ఉంటాడు..
కొన్నిసార్లు మీకు ఏదో పర గ్రహం నుండి భూమి మీదకు వచ్చిన అంతరిక్ష నౌక లాంటి వాహనాలు తారస పడుతూ ఉంటాయి..అవి భక్తబృందాలను దైవ దర్శనం కోసం తీసుకువెళ్ళే వాహనాలు అన్నమాట..కళ్లు చెదిరే వేగం తో వెళ్ళే ఈ వాహనాలు తరచుగా భక్తులను దేవుడి దగ్గరకు తీసుకువెళ్ళడం లో సఫలీకృతం అవుతుంటాయి అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు..
P.S: This post is a free translation of an article written by Coen Jeukens,a Baan Professional from Netherlands, in 2004. I have written this post purely for fun. I do not mean to hurt the sentiments of anyone.


This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]