Sunday, March 23, 2008

 

Pelli Sandadi

"Violence...is a passion ...Violence is a fashion.."
ఎంటి వీడు ఇలా హింస ను ప్రబోదిస్తున్నాడు?? అనుకుంటున్నారా??
ఖంగారు పడకండీ బాబు...ఇది జగడం సినిమా లో పాట.
ఐతే ఇందులో కొత్తేముంది అని తెల్చేయ్యకండి..ఈ పాట నేను విన్న సందర్భం లో ఉంది అసలు విషయం..పెళ్లి మండపం లో పచ్చని పందిట్లో జరగుతున్న పెళ్లి కి background లో ఈ పాట వినిపించింది...
నా సామిరంగా, రాహుల్ ద్రావిడ్ కవర్ డ్రైవ్ లాంటి టైమింగ్ కదూ??..పాపం ఈ విషయం గమనించ లేదో ఏమో కాని , పెళ్లి కొడుకు మాత్రం హ్యాపీ గానే ఉన్నాడు...పెళ్లి కూతురు మాత్రం ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంది..ఎందుకో మరి!!!
ఇంతలో మొహం మీద "ధబ్బ్" మంటూ ఒక ఆకారం వచ్చి పడింది..అదే నండి మన బలూన్ ...
పెళ్లిల్లో ఎవరు ఎంజాయ్ చేసిన చెయ్యకపోయినా, వానర సైన్యం లాంటి పిల్లల మూకలు మాత్రం పండగ చేసుకుంటున్నాయి ...
ఒక పక్క కళ్లు జిగేల్ మనిపించేలా నగా నట్రా పెట్టుకుని ముస్తాబైన అమ్మలక్కల హడావిడి , మరో పక్క వీధిలో లో గొడవలు నుండి ప్రపంచ రాజకీయ సమీక్షల దాక చర్చించేసే "పెద్ద" మనుషుల గడబిడ, ఇంకో పక్క టీనేజ్ కుర్రకారు కొంటె చేష్టల సందడి , మరో పక్కన పెళ్లి ఈడు వచ్చిన అమ్మాయిల చిరునవ్వుల విరిజల్లులు...వెరసి తెలుగింట్లో పెళ్లి...అంటే, కృష్ణవంశీ సినిమా లాగా కళకళ లాడుతూ ఉంది .. .

వాళ్ళబ్బాయిని చేసుకోనందుకు బాధ పడే లక్ష్మి ఆంటీ తో వాళ్ల అమ్మాయిని చేసుకోనందుకు బాధ పడే రావు గారు ఏదో మాట్లాడుకుంటున్నారు..పెళ్లి కొడుకు నాన్నమ్మగారు పెళ్ళికూతురు వాళ్ల అమ్మ గారి పైన ఎందుకో అలిగింది...పెళ్లి కూతురి మామయ్య వాళ్లు పెళ్లి కొడుకు తండ్రి తో ఏదో మంతనాలు జరుపుతున్నారు..ఇదిలా ఉండగా..ఖద్దరు చొక్కా లో ఉన్నా ఏరియా లీడర్ మల్లేష్ యాదవ్ గారు రానే వచ్చారు...ఇంత పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసింది ఇతనేనా? అని అనిపించేలా కనిపించే పెళ్లి కూతురి తండ్రి వెళ్లి యాదవ్ గార్ని సాదరంగా ఆహ్వానించారు.. ....

మండపం లాస్ట్ వరస లో కూర్చున్న బ్యాండ్ పార్టీ వాళ్లు మధ్య మధ్య లో తీసుకున్న డబ్బులకు న్యాయం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు..పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ బ్యాచ్ రానే వచ్చింది. మండపం లో ఉండే అందమైన అమ్మాయిల పైన వినిపించీ వినిపించకుండా చిన్న చిన్న కామెంట్స్..పెళ్ళికి నెక్స్ట్-ఇన్- లైన్ మేమే అన్నట్టు గా తయారైన అమ్మాయిల పని ఉన్నా లేకున్నా తెగ హడావిడి గా ఫంక్షన్ హాల్ అంతా తిరిగేస్తున్నారు.....

ఇదిలా ఉండగా, పెళ్లి లో ఎవ్వర్ని వదలకుండా, తమ అదుపు ఆజ్ఞ్యలలో ఉంచుతూ పెత్తనం చలాయించేది మాత్రం videographer బ్రహ్మం ...తన పనితనాన్ని వివిధ యాంగిల్స్ లో ఆవిష్కృతం చేస్తూ...ముక్కు కారే పిల్లోడి దగ్గర్నుండి... పార్క్ చేసి ఉన్నా డొక్కు కార్ వరకు అన్ని కవర్ చేస్తున్నాడు....కాటేరింగ్ వాదు లంచ్ టైం కి మొత్తం arrange చెయ్యగలడో లేదో కనుక్కొమ్మని పెళ్లి కూతురి తమ్ముడికి పని పురమాయించాడు ఇంటి యజమాని...."అన్ని పనులు నేనే చెయ్యాలి.." అంటూ గొణుక్కుంటూనే బయలుదేరాడు పెళ్ళికొడుకు బ్రదర్-ఇన్-లా......ఇంతలో పెళ్లి కొడుకు వాళ్ల ఫోరెన్ అత్తయ్య మామయ్య వచ్చారనే వార్త చింటు గాడు మోసుకొచ్చాడు......ఆవిడ కట్టుకున్న కొత్త చీర వైపు అక్కడున్న ఆడ వాళ్ల కళ్లు అన్నీ తిరిగాయి..కొన్ని "ఎంత బావుంది" అనుకుంటూ...మరి కొన్ని.."పొద్దు బడాయి..ఎవరికీ తెలియదు ఈవిడ గొప్పలు.." అనుకుంటూ..."ఓరోరి యోగి నన్ను కోరికేయ్ రో.."...ఈ పెళ్లి ఫంక్షన్ లో నేనే డి.జే. అని ఫిక్స్ అయిపోయిన అహ్మద్ భాయి "మంచి" నంబర్స్ ప్లే చేస్తున్నాడు....

ఇంత హడావిడీ లోను తమక్కాబోయే జీవిత భాగస్వామి పక్కనే ఉన్నారనే భావన లో గొప్పదనాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ కొత్త పెళ్లి జంట పెళ్లి కూతురి బుగ్గన పెట్టిన చుక్కంత అందంగా ఉందంటే రాసినోడి భావుకత కాదండీ..ఇది నిజంగా నిజం...

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]